అవినీతిని సహించేది లేదు!..అధికారులకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్  వి. పాటిల్ స్పష్టం

అవినీతిని సహించేది లేదు!..అధికారులకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్  వి. పాటిల్ స్పష్టం
  • విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు, బదిలీలు తప్పవని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలో అవినీతికి పాల్పడే వారిని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు. అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలతో పాటు అవసరమైతే బదిలీలు కూడా చేపడతామని హెచ్చరించారు. సోమవారం ఆయన హైదరాబాద్​లోని చాంద్రాయణగుట్ట సెక్షన్ కార్యాలయంలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విధుల నిర్వహణ, సమయపాలన, విద్యుత్ సరఫరా నాణ్యత, ఆదాయ వసూళ్లపై సీఎండీ సమీక్షించారు. సిస్టమ్ ఇంప్రూవ్‌‌‌‌మెంట్‌‌‌‌కు ప్రాధాన్యతనిస్తూ, సాంకేతిక లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్ది వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. మీటర్ రీడర్లు సకాలంలో రీడింగ్ తీసుకునేందుకు, వినియోగదారులు తమ విద్యుత్ మీటర్లను ఇండ్ల బయట ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

బకాయిలు వసూలు చేస్తేనే మరిన్ని నిధులు

విద్యుత్ బకాయిలు ఉన్న డిఫాల్టర్ సర్వీసులను క్షేత్రస్థాయిలో సందర్శించి, పెండింగ్ బిల్లులను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. ఆదాయ నష్టాలను అరికట్టేందుకు ఇంజినీర్లు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కోసం యాజమాన్యం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఆదాయ వసూళ్లు మెరుగుపడితే మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇకపై సెక్షన్ల వారీగా సమీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఎన్. నర్సింహులు, చీఫ్ ఇంజినీర్  పి. కరుణాకర్ బాబు, ఎస్ఈ టి. శ్రీనివాసు తదితరులు  పాల్గొన్నారు.